హమాలీ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి: పొలాస నరేందర్ విజ్ఞప్తి

పెద్దపల్లిలో హమాలీ కార్మికుల రాష్ట్రస్థాయి సదస్సు.. తరలివెళ్లిన వేములవాడ కార్మికులు
తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ:
హమాలీ కార్మికుల హక్కుల సాధనకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలీ కార్మిక సంఘం వేములవాడ మండల గౌరవ అధ్యక్షుడు పొలాస నరేందర్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా కొత్త చట్టాలు రూపొందించాలని కోరారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన హమాలీ కార్మికుల రాష్ట్రస్థాయి సదస్సుకు ముందు వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులో ఉన్న హమాలీ కార్మిక సంఘం కార్యాలయం ఎదుట పొలాస నరేందర్ కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక కార్మికులు సదస్సుకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్యా, వైద్య ఖర్చులతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చాలీచాలని కూలీలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది హమాలీ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికుల రాకతో స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులకు తగిన భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు గజ్జెల శేఖర్, ప్రధాన కార్యదర్శి గుండం బాలయ్య, సంఘ నాయకులు సుంకపాక రాజు, జోగిని కిషన్, వావిలాల రాజు, కె. శంకర్ తదితరులు పాల్గొన్నారు.