శివానంద హాస్పిటల్ ఫైర్ ఎన్‌ఓసీని తక్షణమే రద్దు చేయాలి 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల-కిరణ్ కుమార్ (టిల్లు) ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పణ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా
క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నోటీసులు ఇస్తామని ఫైర్ ఆఫీసర్ హామీ
కరీంనగర్ నగర పరిధిలోని ‘శివానంద & మెటర్నిటీ హాస్పిటల్’లో తెలంగాణ అగ్నిమాపక చట్టం - 1999 మరియు నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC-2016) నిబంధనల ప్రకారం కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కరీంనగర్ నగరపాలక సంస్థ 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల - తంగేళ్ళ కిరణ్ కుమార్ (టిల్లు) తీవ్ర ఆరోపణలు చేశారు. ఆసుపత్రి భవనాన్ని తక్షణమే క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, నిబంధనలు పాటించే వరకు ఫైర్ ఎన్‌ఓసీ నిలిపివేయాలని లేదా రద్దు చేయాలని కోరుతూ గురువారం రోజున ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు లేఖను అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఫైర్ ఆఫీసర్.. వెంటనే విచారణ చేపట్టి ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బోట్ల శ్యామల-కిరణ్ కుమార్ మాట్లాడుతూ అత్యంత సున్నితమైన గర్భవతులు, బాలింతలు, పసిపిల్లల వార్డులు (NICU/Pediatric Units) మరియు అత్యవసర చికిత్స పొందే రోగులు ఉండే ఈ ఆసుపత్రిలో ప్రమాదం సంభవిస్తే సురక్షితంగా బయటకు తరలించేందుకు సరిపడా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ (Emergency Fire Exits), ర్యాంప్‌లు లేకపోవడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాన ఉల్లంఘనలు ఇవే
తెలంగాణ అగ్నిమాపక చట్టం 1999 (సెక్షన్ 13): ఆసుపత్రులు తప్పనిసరిగా పొందాల్సిన ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ నిబంధనలను పాటించకపోవడం, అమర్చిన భద్రతా పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడం.
నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC - 2016) ఉల్లంఘనలుగ్రూప్ సి ఇన్‌స్టిట్యూషనల్ బిల్డింగ్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన రెండు వెడల్పాటి అత్యవసర మెట్ల మార్గాలు (Fire Escape Staircases) లేవు.
ఆటోమేటిక్ స్ప్రెంక్లర్ వ్యవస్థ, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ అలారాలు సరిగ్గా పనిచేయడం లేదు.
తగినంత నీటి నిల్వ కలిగిన వాటర్ ట్యాంకులు, హైడ్రెంట్ పంపులు మరియు భవనం చుట్టూ అగ్నిమాపక వాహనాలు తిరిగేందుకు అవసరమైన 'సెట్‌బ్యాక్ స్థలం' లేకపోవడం.
గతంలో దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో జరిగిన అగ్నిప్రమాదాల్లో అనేకమంది పసిపిల్లలు, రోగులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలను గుర్తు చేస్తూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా ఎన్‌ఓసీ ఇస్తే భవిష్యత్తులో ఘోర ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరించారు.
కార్పొరేటర్ డిమాండ్లు
అధికారుల బృందంతో శివానంద & మెటర్నిటీ హాస్పిటల్‌లో తక్షణ సమగ్ర ఉమ్మడి తనిఖీలు (Joint Inspection) నిర్వహించాలి.
అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పూర్తిస్థాయిలో అమర్చే వరకు ఆసుపత్రి ఫైర్ ఎన్‌ఓసీని రద్దు చేయాలి.
రోగుల, పసిపిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న ఆసుపత్రి యాజమాన్యంపై తెలంగాణ అగ్నిమాపక చట్టం సెక్షన్ 25 & 26 ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.