వేములవాడ నియోజకవర్గంలో 98 శాతం పూర్తయిన ‘సర్’ ప్రక్రియ నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురణ: ఆర్డీఓ కె.ఎస్.బి.కుమారి

తెలంగాణ అడ్డా వేములవాడ ప్రతినిధి వేములవాడ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్/సర్) 98 శాతం పూర్తయిందని, ప్రస్తుతం చివరి దశలో ఉందని ఆర్డీఓ కె.ఎస్.బి.కుమారి తెలిపారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, నవంబర్ 9న తుది జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు వెల్లడించారు.
వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన అఖిలపక్ష రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆర్డీఓ ఈ వివరాలను వెల్లడించారు. ‘సర్’ ప్రక్రియ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్ఏలు, బీఎల్వోలు, ఎన్నికల సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణకు బుధవారమే చివరి గడువు అని, అందిన క్లెయిములు, అభ్యంతరాలను నవంబర్ 5లోగా పరిష్కరించే ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 9తో ‘సర్’ ప్రక్రియ ముగుస్తుందని, అయితే ఫారం-6, 7, 8 ద్వారా ఓటర్ల నమోదు, తొలగింపు, సవరణలకు సంబంధించిన ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో మొత్తం 2,29,132 మంది ఓటర్లు ఉండగా, పరిశీలన అనంతరం 2,02,323 మంది అర్హులుగా తేలినట్లు ఆర్డీఓ తెలిపారు. మిగిలిన 26,809 మంది ఓటర్లలో డబుల్ ఓట్లు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన (షిఫ్టెడ్) ఓటర్లు తదితర అనర్హతలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు వెల్లడించారు.
సమావేశంలో అఖిలపక్ష నేతలు పొలాస నరేందర్, మైలారం రాము, కడారి రాములు, చింతలకోటి రామస్వామి గౌడ్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.