స్తంభంపల్లిలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు మహాత్మా గాంధీ, శాస్త్రీజీల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి: సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్

తెలంగాణ అడ్డా బోయినపల్లి ప్రతినిధి స్తంభంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింసా సిద్ధాంతాలు ప్రపంచానికే నిత్య ఆదర్శాలని అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ చేసిన త్యాగాలు, దేశానికి అందించిన సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నేటి యువత గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో నడుస్తూ దేశ ఐక్యత, జాతీయ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రెండవ ప్రధానిగా శాస్త్రిజీ అందించిన సేవలు, రైతుల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిన మహనీయుడిగా శాస్త్రిజీని స్మరించుకున్నారు. దేశం కోసం స్వాతంత్ర్య సమరయోధులు, పోరాట యోధులు చేసిన త్యాగాలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి మౌనిక, ఉప సర్పంచ్ చంద్రగిరి అశోక్, వార్డు సభ్యులు చంద్రగిరి వెంకటేశ్, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, అక్కనపల్లి మధుకర్, చిలుముల శ్రీమణి, ఎర్ర సువర్ణ, కొట్టపల్లి రమ్యశ్రీ, శ్రీ సుగ్రీవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బీరవెళ్ళి వెంకటేశ్వరరావు, అంబేడ్కర్ సంఘం ఉపాధ్యక్షుడు గంగాధర వెంకటరమణ, అంగన్వాడీ టీచర్లు అక్కనపల్లి నీలమ్మ, అక్కనపల్లి భాగ్యలక్ష్మి, మహిళా సంఘాల కోఆర్డినేటర్ కాంతమ్మ, ప్రేమలత, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.