తెలంగాణలో పెరిగిన ఆటో ఛార్జీలు అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:
దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఆటో రిక్షా ఛార్జీలను సవరిస్తూ రవాణా శాఖ అధికారికంగా జీవో జారీ చేసింది. ఇంధన ధరలు, నిర్వహణ మరియు బీమా వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకుని ఈ నూతన ధరలను ఖరారు చేశారు. సవరించిన కొత్త ఛార్జీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
కనీస ఛార్జీ: మొదటి 1.6 కిలోమీటర్ల ప్రయాణానికి కనీస ఛార్జీని రూ. 20 నుండి రూ. 30కి పెంచారు.
అదనపు కిలోమీటర్ల ధర: 1.6 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ. 14 చొప్పున వసూలు చేయనున్నారు (గతంలో రూ. 11 ఉండేది).
వెయిటింగ్ (డిటెన్షన్) ఛార్జీలు: ట్రాఫిక్ లేదా ఇతర కారణాల వల్ల ఆటో నిలిచిపోయినప్పుడు వర్తించే వెయిటింగ్ ఛార్జీని నిమిషానికి 50 పైసల నుండి 75 పైసలకు సవరించారు.
రాత్రి సమయపు ఛార్జీలు: రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణించే వారికి సాధారణ ఛార్జీపై అదనంగా ఒకటిన్నర రెట్లు (1.5x) వసూలు చేసే వెసులుబాటు కల్పించారు.
లగేజీ నిబంధనలు: ప్రయాణికులు తమ వెంట బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్ వంటివి ఉచితంగా తీసుకెళ్లవచ్చు. వీటి మినహా ఇతర పెద్ద లగేజీ ప్యాకేజీలకు ఒక్కోదానికి 25 పైసల నుండి 50 పైసల చొప్పున ఛార్జీ వర్తిస్తుంది. ఆటోలో గరిష్టంగా 100 కిలోగ్రాముల వరకు లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.
కొత్త ఆటో ఛార్జీల అమలు కోసం ఆటో డ్రైవర్లు రాబోయే మూడు నెలల్లోపు డిజిటల్ మీటర్లను రీసెట్ చేసుకోవాలని లేదా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటివరకు ఆటోల్లో విధిగా పాత, కొత్త ఛార్జీల టారిఫ్ కార్డులను అందుబాటులో ఉంచాలని సూచించింది.