Back to Home
Watermark
సోమవారం, 28 సెప్టెంబర్, 2026 TIME : 06:45 PM

నగరపాలక సంస్థలో ప్రైవేట్ వ్యక్తుల చేతికి చేయూత పెన్షన్ డేటా ఎంట్రీ.. ఆధార్ ఒకరిది.. పేరు మరొకరిది.. ప్రభుత్వ గోప్యతకు తూట్లు, లబ్ధిదారుల ఆందోళన!

Main Image

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డ:

కరీంనగర్ నగరపాలక సంస్థలో పౌర సేవల నిర్వహణ గాడి తప్పుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైన 'చేయూత పెన్షన్' ఆన్‌లైన్ ఎంట్రీ బాధ్యతలను ప్రభుత్వ సిబ్బందిని విడనాడి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారిక రికార్డులు, ప్రజల వ్యక్తిగత సమాచారం (డేటా) ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమైంది.

ఆధార్ ఒకరిది.. పేరు మరొకరిది.. తీవ్ర తప్పిదాలు:

పెన్షన్ దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదులో తీవ్రమైన నిర్లక్ష్యం బయటపడుతోంది. ఏకంగా ఆధార్ నంబర్ ఒక వ్యక్తిదిగా ఉంటే, పేరు మరో వ్యక్తిదిగా నమోదు అవుతున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. సంక్షేమ పథకాల ఎంట్రీలో ఇటువంటి తప్పులు దొర్లడం వల్ల అర్హులైన నిజమైన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సాంకేతిక లోపాలు లేదా డేటా ఎంట్రీ చేసేవారి బాధ్యతారాహిత్యం వల్ల పేదలకు అందాల్సిన సాయం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రభుత్వ డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్?:

మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత సాకుతో ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత సున్నితమైన, గోప్యమైన డేటాను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. పౌరుల ఆధార్ వివరాలు, వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం చట్టరీత్యానే కాకుండా భద్రతాపరంగా కూడా ప్రమాదకరమే. ఎలాంటి అధికారిక బాధ్యత, జవాబుదారీతనం లేని ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా డేటా ఎంట్రీ చేస్తుండటం వల్లనే ఇలాంటి భారీ తప్పిదాలు పునరావృతమవుతున్నాయి.

ప్రశ్నిస్తే 'కమిషనర్ అడుగు పో' అంటూ నిర్లక్ష్య సమాధానం:

ఈ తప్పులపై బాధ్యులైన మున్సిపల్ సిబ్బందిని వివరణ కోరగా, బాధ్యతాయుతంగా స్పందించాల్సింది పోయి “కమిషనర్ గారిని అడుగు పో” అంటూ అత్యంత దురుసుగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలు, మహిళలు తమ సమస్యలపై వస్తే గౌరవంగా స్పందించాల్సిన ఉద్యోగులు ఇలా ప్రవర్తించడం వారి అహంకార ధోరణికి అద్దం పడుతోంది.

ప్రజా డిమాండ్లు:

చేయూత పెన్షన్ ఆన్‌లైన్ ఎంట్రీలో తప్పుగా నమోదైన ఆధార్ మరియు లబ్ధిదారుల పేర్లను వెంటనే సమగ్రంగా పరిశీలించి సరిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యాన్ని, డేటా ఎంట్రీ పనులను తక్షణమే నిలిపివేసి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పారదర్శకంగా పనులు జరిగేలా చూడాలని కోరుతున్నారు.

ప్రజలతో అత్యంత దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత సిబ్బందిపై తక్షణమే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ రికార్డులు, ప్రజల వ్యక్తిగత డేటా గోప్యతకు భద్రత కల్పించేలా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Clip Adjustments