Back to Home
Watermark
శనివారం, 26 సెప్టెంబర్, 2026 TIME : 03:43 PM

వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు తెలంగాణ చౌక్‌లో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

Main Image

వీరవనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

తెలంగాణ చౌక్‌లో బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ:

వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లోని ఐలమ్మ విగ్రహానికి బీసీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో బీసీ సాధికారిత సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జీ పొలాస నరేందర్, రాష్ట్ర రజక సంఘం నేత లింగంపల్లి దేవయ్య మాట్లాడారు.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని పొలాస నరేందర్ అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం భూస్వాముల దౌర్జన్యాలను ఎదుర్కొని, ఏమాత్రం భయపడకుండా పోరాడిన ధైర్యవంతురాలిగా ఐలమ్మ నిలిచారని పేర్కొన్నారు.

ఐలమ్మ ఉద్యమం నుంచి తప్పుకునేలా చేసేందుకు భర్త నర్సయ్య, కుమారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినా ఆమె వెనుకడుగు వేయలేదని నరేందర్ తెలిపారు. పంట, ఆస్తి నష్టాలు ఎదురైనా ధైర్యంగా పోరాటాన్ని కొనసాగించారని అన్నారు.

ఐలమ్మ స్ఫూర్తితో సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా అనేక గ్రామాలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందాయని, భూమి కోసం జరిగిన పోరాటం అణగారిన వర్గాలకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ భౌతికంగా లేకపోయినా ఆమె ఆశయాలు, ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని లింగంపల్లి దేవయ్య అన్నారు. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ఐలమ్మ పోరాట జీవితం ఆదర్శంగా నిలిచిందన్నారు.

కార్యక్రమంలో జిల్లా బీసీ నేతలు కనపర్తి సుధాకర్, బొజ్జ రమేష్, చింతలకోటి రామస్వామి గౌడ్, మొగిలి అంజయ్య, నేరేళ్ల నర్సయ్య, శబాస్‌పల్లి బాలమల్లు, కుంభం రవి, వట్టేముల పాట దేవయ్య, అద్దంకి సత్తయ్య, డి.చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments