నామినేటెడ్ పదవుల్లో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలి

పదవులు దక్కకపోవడంపై మండల స్థాయిలో మాదిగ నాయకులు, కార్యకర్తల అంతర్గత సమావేశం
మూకుమ్మడి రాజీనామాలపై చర్చ జరుగుతోందన్న ప్రచారం
కోనరావుపేట మండలం తెలంగాణ అడ్డా సెప్టెంబర్ 21
కోనరావుపేట మండల పరిధిలో అధికార పార్టీకి చెందిన మాదిగ సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పదవుల్లో తమకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదనే అంశంపై అంతర్గతంగా సమావేశమైనట్లు సమాచారం.
మండలంలో మాదిగ సామాజిక వర్గానికి గణనీయమైన జనాభా, ఓటు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీలు, వివిధ ప్రభుత్వ కమిటీలు, పార్టీ బాధ్యతల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
“ఓటు సమయంలో మాదిగల ప్రాధాన్యత గుర్తుకు వస్తుంది.. పదవుల పంపకంలో మాత్రం ఎందుకు గుర్తుకు రావడం లేదు?” అంటూ కొందరు నాయకులు ప్రశ్నించినట్లు సమాచారం. సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం దృష్ట్యా మాదిగ నాయకులకు సముచిత అవకాశాలు కల్పించాలని వారు కోరినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలా? లేక పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాలా? అనే అంశంపై కూడా చర్చించినట్లు మండలంలో ప్రచారం జరుగుతోంది. అయితే రాజీనామాలపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడికాలేదు.
నామినేటెడ్ పదవులు, కమిటీలు, పార్టీ బాధ్యతల్లో మాదిగ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది.
ప్రాతినిధ్యం కోసం తమ వాణిని వినిపించడం ఎవరికీ వ్యతిరేకం కాదని, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో తమ డిమాండ్లను తెలియజేస్తున్నామని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నట్లు సమాచారం.