అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కు పొందేలా కృషి చేయాలి: ఆర్డీఓ కె.ఎస్.బి. కుమారి

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
వేములవాడ, సెప్టెంబర్ 19 (తెలంగాణ అడ్డా):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వేములవాడ ఆర్డీఓ కె.ఎస్.బి. కుమారి కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా సహకరించాలని ఆమె సూచించారు.
శనివారం సాయంత్రం 4 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష నేతల సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ప్రకటించిన SIR ప్రక్రియ షెడ్యూల్‌ను ప్రతి ఓటరు పరిశీలించి, తమకు కేటాయించిన తేదీ, సమయంలో పోలింగ్ కేంద్రంలో జరిగే విచారణకు హాజరు కావాలని సూచించారు. నోటీసులో పేర్కొన్న విధంగా అవసరమైన గుర్తింపు పత్రాలను సమర్పించాలని కోరారు.
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని 262 పోలింగ్ కేంద్రాల్లో ప్రభుత్వపరంగా బీఎల్‌వోలు, వివిధ రాజకీయ పార్టీల తరఫున బీఎల్‌ఏలు పనిచేస్తున్నారని తెలిపారు. ఓటర్లకు ఏవైనా సందేహాలు లేదా సమాచారం అవసరమైతే సంబంధిత పోలింగ్ కేంద్రం బీఎల్‌వో, బీఎల్‌ఏలను సంప్రదించాలని సూచించారు.
ఓటరు జాబితాలో అభ్యంతరాలు, ఫిర్యాదులు, చేర్పులు, మార్పులు, సవరణలు, తొలగింపులు లేదా కొత్తగా ఓటరు నమోదుకు అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8లను వినియోగించుకోవచ్చని ఆర్డీఓ తెలిపారు. దరఖాస్తులు, అభ్యంతరాలకు అక్టోబర్ 7 చివరి తేదీ కాగా, తుది ఓటరు జాబితా ప్రచురణ నవంబర్ 9న ఉంటుందని వెల్లడించారు.
సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. నిత్యానందరావు, బీఆర్‌ఎస్ నాయకులు పొలాస నరేందర్, టీడీపీ నాయకులు చింతలకోటి రామస్వామి గౌడ్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.